తెలుగుతల్లి గీతకర్త కీ।శే॥ శంకరంబాడి సుందరాచారి గారు కవితాప్రయోజనాన్ని కామినీవిలాసంతో కాకుండా.. కన్నతల్లి వాత్సల్యంతో కమనీయంగా పోల్చిచెప్పిన అర్థశతాబ్దం కిందటి అర్థవంతమైన కవిత ‘నవ్విన నవ్వి పోవనీ’ లోని ఒక ముఖ్యమైన మూడు పద్యాలు
అందములేని యాకృతికి నందము కూరిచి, మందిమీద కే
సందె వెలుంగులోన తగుచాటున చక్కగ నక్కి కృత్రిమా
నందము నీయ న న్వలచునట్లు నటించెడు భోగకాంత చ
క్కందముచూపి తన్పకల కామిని కావ్యసుమాంగి కాదు, నన్;
కనిన దినమ్మునుండియును, కంటికి రెప్పగ కాచి పెంచి, స
ద్గుణములు నేర్చి, సంఘమున కూడి చరించెడు శక్తినిచ్చి, పె
న్చనవున చక్కదిద్ది, సుఖసంపద చే నిడు పూర్ణమూర్తి యా
జననియె కావ్యమాత యని స్వాంతములో తలపోసి, పూనెదన్ః
భావుకులన్న పేరిటను వందలువేలుగ దేశమెల్లెడన్
తావలమంది, నవ్యకవితా వనవాటుల కోకిలమ్ములై,
భావము బంధము న్వదలి పల్కులనల్లి పదాలు పాడు ‘పుం
భాసర్స్వతీప్రియులు’ ఫక్కున నవ్విన నవ్విపోవనీ!