కవిత్వమంటే?!-వాకిలి-ఇ-పత్రికలో ప్రచురితం

కవిత్వమంటే?!

24-మే-2013

 

కరవీర కుసుమము, గులాబీ పువ్వు కళ్ళు తెరిచాకా దాదాపు ఒకే రూపు. మొగ్గలుగా ఉన్నప్పుడు మాత్రం ఒకటి గుడి ఒకటి గోపురం. వీటి మూల రహస్యం ఏమిటో తేల్చుకుందామని కాచుక్కూచుంటే..ఎపుడో ఒక నిశ్శబ్ద గడియలో రససెల్లాలో నుంచి తొంగిచూసే ముగ్ధ వధువు లాగా మిసమిసలాడుతూ ప్రఫుల్ల నేత్రాంచలాలను రెపరెపలాడిస్తాయి. సృజన జన్మరహస్యం మాత్రం అంతుబట్టదు!

దారిన పోతొంటే కాలికి ముల్లు గుచ్చుకోవచ్చు. అపురూప సౌందర్యరాసి సందర్సన సౌభాగ్యమూ దక్కవచ్చు. విడివిడిగా రెండు విరుద్ధ సంఘటనలే కాని సమన్వయించే సామర్థ్యముంటే అవే ఓ అభిజ్ఞాన శాకుంతలాంకురాలు. సమన్వయ శక్తికి పాదు ఎక్కడో తెలియదు!

పట్టుబట్టి ఎప్పుడో కలం కాయితాలు పట్టుక్కూర్చుంటే బుర్ర బద్దలవడం తప్ప ఫలితం సున్న. పదాలనాశ్రయించీ, పాదాలను దిద్దీ, పర్వతం ప్రసవించినట్లు ఓ మాటల కుప్పను పోగేసినా కవిత్వమనిపించుకోదు. శ్రీరస్తు నుంచి శుభమస్తు దాకా సమస్త శ్రీమదాంధ్ర మహాభాగవతాన్నీ మహానుభావుడు బమ్మెర పోతనామాత్య్డుడు ఒక్క ఉదుటనే పద్యాలబండిలా తోలుకెళ్ళాడన్నా నమ్మలేం. కావ్యాలేమన్నా శాసనాలా? కాళిదాసు కుమారసంభవమేంటి.. ఆఖరుకా సాక్షాత్తా శ్రీశంకరభగవత్పాదుల సౌందర్యలహరైనా సరే .. ఒక్క బిగినే ‘ఇతిసమాప్తః’ అవడం అసంభవం. ఒక వాక్యం ఒక్క సారే అతకదు. ఒక అర్థం ఒకసారే పొదగదు. ఒక భావం ఒకే సారి పొసగదు. సృజన-భావాత్మక స్థాయీభేదమా? దానికదే ఓ అంతిమ ఆత్మస్వరూపమా? ఉచ్చారణ మొదలు భావాంత పర్యంతమూ సర్వ జీవశక్తులూ విభావాదుల్లా వివిదౌపచారికాలు నిర్వహిస్తేనే కదా ఏరసభావానికైనా ఓ అంతిమ స్థాయి! అంతిమం సరే..రసం అసలు ఆది కొసేదో అంతుబట్టదు!

ఒక కొబ్బరి చెట్టు. దానికి వంపుగా సొంపుగా వాలి నట్లున్న శాఖకు వరసగా తోరణాలు కట్టినట్లు ఆకులు. వాటి మీద ఉదయభానుడి లేత కిరణాలు పడి కోమల మలయ సమీరానికి ఒకటొకటే క్రమంగా కదులుతోంటే ‘తరుణాంగుళీచ్చాయ దంతపు సరికట్టు లింగిలీకపు వింత రంగులీనింద’న్న భావాక్షర వీణాతంత్రి సాక్షాత్కరమవడం లేదూ! శరద్రాతుల్లోఐతే గోపాలకృష్ణయ్య ఎక్కడో నక్కి వేణుదండం మీద గర్భకేతకీ దళం వంటి వెన్నెల వేళ్ళతో చాలనం చేస్తున్న సమ్మోహన ఊహ మనసు నూయల లూగిస్తుంది . అక్కడితో ఆగితే మంచిదే! అవ్యక్తంగా ఆ వేణు స్వరాలు మన కర్ణద్వయంలో నర్తించుతో గుండెలకు రెక్కలు తొడిగి ఏ గంధర్వ లోకాలకో ఎగరేసుకు పోవచ్చు. ఏ వరూధినో రత్నసానువు కోన భోగమంటపాన కనిపించి లోకాలకు దారే తోచనీయకుండా మీది మీది కొచ్చేయచ్చు. మళ్ళీ కాళ్లు నేలకాని నిట్టూర్పుసెగలు చురుక్కుమనిపించే వరకూ..సాగే ఆ భావాంబర వీరవిహారం పేరేమిటో? నింగిని వదిలి నింగికి దిగిందాకా మనసున సాగే ఊహా విహంగ యానమంతా కవిత్వమేనా పాకం పడితే? మరైతే ఆ పాకం పండేదే ఎలా? ఆ అనుపాకం సమపాళ్ళు ఆరంభంలో తెలిసిందే పుంభాసరస్వతికో?

చెరువు గట్టు కెళ్ళి కూర్చున్నామనుకోండి సరదాగా ఓ అందమైన సాయంకాలం పూట మిత్రబృందమంతా కలసి. ప్రేషించబడ్డ నాగసంతానమంతా సర్పయాగంలో ఆహుతి నిమిత్తం తరలిపోతున్నభ్రాంతి కలిగిస్తుంది మన వైపుకే ఉరికురికొచ్చే అలల సందోహం! అవే తరంగాలు మరో మిత్రుడి కంటికి పరుగుపందెంలో గెలుపు కోసం ఉరకలెత్తే చురుకు కురంగాలనిపించొచ్చు. ఇంకో నేస్తానికి దోస్తులంతా కలసి చేసే ఈత వినోదంలా తోచవచ్చు. నాచన సోమన-’హరివంశం’ సత్యభామ హరికంటికొక రకంగా..అరి కంటికింకో తీరుగా తోపించినట్లు.. ఒక్కవస్తు సందర్శనంలోనే ఎన్ని భావలోకాలో! కవైన వాడికైతే గుండెల్లో బొండుమల్లెల చెండు వాసనలు గుబాళించవూ! చేతిలో రాతసాధనం లేనంత మాత్రాన ఊహలో పొంగులెత్తే రసగంగ ప్రవాహం భంగపడుతుందా? మదిలో ‘మా నిషాద’ శ్లోకభావం కదలాడినప్పుడు వాల్మీకి కవి హస్తాన ఏ గంటముందంట? ‘మాణిక్య వీణా ముపులాలయంతీ’ అంటో కాళిదాసు గళానలా ఆశుకవితాజల సెలయేరులా గలగలా పారినవేళా లేఖినేదీ దాపునున్న దాఖలాల్లేవే! పైసాపైసా కూడబెట్టే లుబ్ధుడికి మల్లే రసలుబ్ధుడైన కవీ రసాదికాలకు ఆది మూలమైన భావ దినుసులను ఏ హృదయపేటికలో భద్రపరుస్తాడో? ప్రయోగించే సందర్బరహస్యాన్నెలా పసిగట్ట గలుగుతాడో?

అలాగని ప్రతీ మనిషీ ఇలా కనిపించిన ప్రతీ దానిలోనల్లా కవితామతల్లినేదో కల్పించుకొని ఆమె రూపురేఖాదులను అల్లిబిల్లిగా అల్లుకుని పోతానంటే ‘అనంతా వై వేదాః’ అన్నట్లు ఈ పాటికీ ఈ భూమండలమంతా కవిల కట్టల్తో నిండి ఏడు సముద్రాలూ పూడిపోయుండేవి కావా! ‘ఆ దస్తరాల్లో చిక్కడి పోయే దుస్తరం తప్పింది.ఆనందమేనం’టారా? మరి మిణుగురు పురుగులా తటాల్మని తట్టే సీతాకోకచిలుక మల్లే మనోభావం చటుక్కుమనెటో ఎగిరిపోతేనో? గుప్పెట పట్టి గూట్లో పెట్టే సాధనమంటూ ఏదో ఒకటుండటమూ ఉత్తమం కదా? గాలీబ్ మహాశయుడికేదైనా ఓ అందమైన భావం మదిలో కదులాడటం మొదలవంగానే పాటగానో పద్యంగానో గుణించుకుంటో అందుబాటులో ఉన్న ఏ దస్తీతోనో..ఆఖరికే అంగీ అంచుల పోగుతోనైనా సరే ముచ్చ్టటైన ముడులుగా మలుచుకునే అలవాటు. తీరిక దొరకబుచ్చుకొని మళ్ళా ఆ ముళ్ళనలాగే విప్పుకుంటో చూచిరాతంత చక్కంగా పద్యాలు చెక్కి వుండక పోతే మనకీ రోజు ఇన్నేసి చక్కని కైతల పాతర్లు దక్కుండేవా?

చింతచెట్టు చిగురు కంటబడంగానే ‘చిన్నదాని పొగరు’ పాట చటుక్కుమని గుర్తుకొస్తుంది. రెండింటికి సామ్యమేమిటో? నల్లటి బుర్రమీసాలాసా మెవరన్నా ముదురుపెదాల మరుగునుంచీ బలిష్టమైన లంకపొగాకు చుట్టపీకొకటి లంకించుకుని గుప్పుగుప్పుమని పొగొదుల్తూ కనిపిస్తే రైలుబండే రోడ్డు మీదకొచ్చినట్లనిపిస్తుంది ఎంత జడ్డికైనా. అక్షరానికందకుండా అగరు ధూపంలా అనుభవించి వదిలేసే ఊహావల్లరులనలా వదిలేసినా.. ఎన్నటికీ అణగిపోని కొన్ని భావమణుల వెలుగుజిలుగుల వెనకున్న రహస్యమేమిటో? తెర వెనక్కి వెళ్లినట్లే వెళ్ళి ఆదృశ్యమో.. సాదృశ్యమో తటస్థించినప్పుడు కొత్త సామ్యాలతో మళ్ళీ మనోయవనిక ముందు మెరుస్తుంటాయే! ఎందుకనలా?

కుసుమశరుడి లాగా భావసుందరీ మనసిజ. ఒక్క రుద్రుడికే మన్మథుడు దద్దరిల్లాడు కాని ఏకాదశ రుద్రులెదురైనా భావసుందరి సిగకొస కదలదు. ఏ బంగారిమామ బెంగ పడ్డా, ఏ బిచ్చగత్తె వొరుగులాంటి వడలిపోయిన కాయంతో చింపిరి తలా చిరుగు వలువల్తోనడవలేక నడుస్తూ వీధి వాకిట్లో నిలబడ్డా, మరకతాలు పరిచినట్లున్న పచ్చని ఆకుమళ్ళ గట్ల మీద చేరి అన్నంమూటలు విప్పుకుంటో వర్షాభావం వల్ల వాలు మొహాలు వేసిన వరినారును చూసి కళ్ళు చెమర్చిన అన్నదాత.. నురుగులు కక్కే దేహంతో కష్టాల కావిళ్ళు మోసే కూలన్నమెలిబడ్డ నొసటి రేఖ కంటబడ్డా, దూరంగా ఎక్కడొ ప్రేయసి చూపులో చూపుంచి వినిపించే అతి సుందర నిశ్శబ్ద మందర కాకలీ స్వరం చెవిన బడ్డా.. తళుక్కుమని మెరుస్తుందే.. మానసాంబర వీధిన భావతారా తోరణం.. ఏ సూత్రమాధారమో ఈ వింత పాలపుంత ధారకు?

కవిత్వమంటే ఇన్నిసాధక బాధకాలా? మబ్బుకు దివిటీ పట్టే మెరుపు విద్యంటారే విజ్ఞులు! చూసిన చిత్రం..చేసిన భావం మాటల్లోనో..మనసుల్లోనో భద్రం చేసి సమయం చూసి సూటిగా లక్ష్యాన్నిచేదించటమంటే మరి మాటలా? కలానికి కాలానికి కట్టుబడెలా ఉంటుందీ తత్వం? అలుగులు పారే సజీవకళతో ఉరకలు ఎత్తే నిత్యచైతన్య ప్రవాహోత్శి కదా కవిత్వం! ‘నదీనాం సాగరో గతిః’ చందంగా పొర్లుకొచ్చే భావవాహినికి ఆనకట్టలు కట్టి పంటకాలువలు తీసి పూలూ పండ్లూ పెంచి లోకానికా జీవప్రసాదం పంచే వనమాలి కదూ కవి! ఉచ్చృంబలంగా సాగే జీవప్రవాహం ఏ కొండో బండో అడ్డగిస్తే.. వెనక్కి మళ్ళటమో..ఉబికుబికి ముందుకు ఉరకటమో..ఏ లోయో సంప్రాప్తమైతే హడిలి అంతెత్తు పైనుంచీ మోతలు పెట్టుకుంటో పాటుగా దూకి పడి ముందుకు సాగటమో..ఏ వంపులో, ముంపులో తగిలినప్పుడు తల ప్రాణం తోకకొచ్చినట్లు సుళ్ళు తిరిగి ఊగటమో!కవిత్వ తత్వమూ అదేనేమో! కవి జీవన యానంలో అందమైన విఘాతాలు అప్పటికైతే విస్మృతి లోకెళ్ళి పోయినా.. మనసడుగుపొరల్లోనే ఎక్కడ పడుకుని ఉంటాయో.. వాస్తవ జీవితం ఏ కష్టంతోనో, ఇష్టంతోనో ముష్టియుద్దానికో, ముద్దులాటకో సిద్దమైన క్షణాన.. పునరుజ్జీవం పొంది తెర ముందు కురికొచ్చేస్తుంటాయి.అలా రావడమే అసలు సిసలు కవిత్వతత్వ రహస్యమేమో! మరి రససిద్ధులైన పెద్దలేమంటారో..ఏమో!

(వాకిలి- ఇ-పత్రికలో ప్రచురితం)

6 thoughts on “కవిత్వమంటే?!-వాకిలి-ఇ-పత్రికలో ప్రచురితం

  1. కవిత్వమంటే ?ఎంత ఎవ్వరు చెప్పినా అసంపూర్ణం!అంతేనా కర్ణపాలెం హన్మంతరావు గారూ!కవిత్వ తత్వ రహస్యం ఒక ప్రహేళిక,దానిని పూరించలేము!రసహృదయ అంతస్సారం ,మిసమిసల సమ్మేళనం ,చిరుచిరుతపనల బుడిబుడినడకలు,మేలిమి బంగరులో అక్షరాలను వజ్రాల్లా పొదగడం !కవి విగరు పొగరు కవిత్వం!అక్షరాల సమూహాలను గాలిలో ఎగరేయడం కవిత్వం! కవిహృదయతంత్రి పిల్లగాలికే స్వచ్ఛందంగా మోగుతుంది!కితకితలు పెడుతుంది,,గిచ్చుతుంది,చురుక్కుమనిపిస్తుంది!ఆర్ద్ర అపురూప అనన్య కవన జననం ఒక రస ప్రసవమ్!

  2. శ్రీ హనుమంతరావుగారికి, నమస్కారములు.

    ముడి బంగారానికి పుటం వేసినతరువాత దాని అసలు జెలుగు బయట పడుతుంది. అలాగే, కవిత్వం వ్రాయాలనుకొనేవారికి ఈ వ్యాసం చదివిన తరువాత తమ హృదయం హృద్యమై కవితా శక్తి తప్పక కలుగుతుందని నా భావన.

    మీ స్నేహశీలి,
    మాధవరావు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s