ప్రపంచ పక్షి -పొద్దులో నా కవిత

 

గత డిసెంబర్లో పొద్దు అంతర్జాల మాస పత్రికలో ప్రచురించ బడిన నా కవిత ఇది.
చదివి మీ స్పందనను ఆ పత్రికముఖంగానే తెలియచేయమని మనవి.

ప్రపంచ పక్షి
కర్లపాలెం హనుమంతరావు,24-12-2010

సృష్టి నాటి నుంచి చూస్తున్నా
సూర్యుడెప్పుడూ తూర్పునే ఉదయిస్తున్నాడు
దశాబ్దాలనీ శతాబ్దాలనీ
గుర్తుల కోసం నువ్వే ఋతువుల పేర్లైనా పెట్టుకో
కాలం మాత్రం అనంతం నుంచి అనంతంలోకి
సాగే జీవన ప్రవాహం
మనిషి అందులో ఒక అల

నదులూ , సముద్రాలూ, పర్వతాలూ,
అగాధాలూ, అడవులూ, ఎడారులూ,
మహా సముద్రాలనీ
నేలనీ, నీటినీ ముక్కలు ముక్కలు చేస్తున్నావ్!

జాతులనీ, రంగులనీ, మతాలనీ , కులాలనీ,
బానిసలనీ,
నిన్ను నీవే నిలువుగా, అడ్డంగా
నరుక్కుంటున్నావ్!

నిజమే….
నడక మాత్రమే తెలిసినవాడివి- నదులు
నీకడ్డమే మరి!

శతాబ్దానికవతల ఏముందో వినలేని
చెవిటి వాడివి
కంటికి కనిపించనిదంతా నీకు దగా!
నీ గుళ్ళూ, గోపురాలూ, పిరమిడ్లూ, ప్యాలెస్ లూ
నగరాలూ, నాగరికతలూ
కాలం తీరాల వెంట శిధిలాల్లా పడి ఉన్నాయ్!

నత్త గుల్లలే నీ చరిత్రకు గుర్తులుగా మిగిలున్నాయ్!
అణువును ఛేదించి అస్త్రాలను చేసేవాడా
జీవాన్ని మమ్మీ గా మార్చి పిరమిడ్ బొడ్డులో దాచేస్తావా?
కరువులూ, కాటకాలూ, వరదలూ, తుఫానులూ,
భూకంపాలూ, సునామీలు చాలకా …
మధ్యలో పుట్టి మధ్యలో పోయే ఓ మనిషీ!
మళ్ళీ యుద్ధాలను సృష్టిస్తున్నావ్!

నీ అధికారం, ఉగ్రవాదం, యు యెన్ వో వీటో పవరూ,
ప్రభుత్వాలూ, పహరాలూ డాలర్లు పేటెంట్లు
అణువుపగిలితే అంతా మసి!
విశ్వాన్ని జయించాలని విర్రవీగిన నియంతలు
బాత్రూముల్లో జారిపడి చచ్చిన ఉదంతాలు
వినలేదా!

క్యాలెండరుకు ముందేముందో తెలీనివాడివి
నీ కన్న పిట్ట నయం!
చినుకు కోసం నేలపడే తపన దానికి తెలుసు
ఉనికి కోసం జీవిపడే ఆరాటం తను చూడగలదు

తల్లడిల్లే పిల్లవాడు తల్లి నాలుకతో ‘అమ్మా!’
అనే ఏడుస్తాడు ఏ ఖండంలోనైనా
తల్లి నాలుకలు వేరైనా తల్లి మాత్రం ఒక్కటే
బాధలకూ, భయాలకూ రంగులు వేరైనా వాసన ఒక్కటే అయినట్లు
జపానుకైనా ఇరానుకైనా
చెక్కిళ్ళ మీద జారే కన్నీళ్లు ఎప్పుడూ ఉప్పగానే ఉంటాయి

ఆఫ్రికా అడవులైనా, అలప్స్ కొండలైనా,
నైలునది నీళ్ళయినా, దార్ ఎడారి ఇసుకైనా
ఎవరెస్టు శిఖరమైనా మృత్యులోయ లోతైనా
పిట్ట కొక్కటే!

మనిషి ముక్కలు చేసిన ఆకాశాన్ని
తన రెక్కలతో కుట్టుకుంటూ
రవ్వంత వసంతం కోసం దిగంతాల అంచుల దాకా
ఎగరటమే దానికి తెలుసు

నేను
అలుపెరగని ఆ వలసపక్షిని
ప్రపంచ పక్షిని

ఖండాల జెండాలన్నీ ఒక్కటేనని మనిషి
నమ్మేదాకా దేశదేశాలకు
ఈ సందేశాన్ని పంచటమే నా పని!

http://poddu.net/?q=node/783

(పొద్దు అంతర్జాల పత్రికకు కృతజ్ఞతలతో )

5 thoughts on “ప్రపంచ పక్షి -పొద్దులో నా కవిత

 1. మనిషి ముక్కలు చేసిన ఆకాశాన్ని
  తన రెక్కలతో కుట్టుకుంటూ
  రవ్వంత వసంతం కోసం దిగంతాల అంచుల దాకా
  ఎగరటమే దానికి తెలుసు,.మంచి కవిత,.ప్రపంచానికి అవసరమైన భావం,..అభినందనలు సార్స..

 2. వావ్ ! చాలా చాలా బాగుంది .

  “ఖండాల జెండాలన్నీ ఒక్కటేనని మనిషి
  నమ్మేదాకా దేశదేశాలకు
  ఈ సందేశాన్ని పంచటమే నా పని!”

  అల్పాయుష్కురాలైన ఆ పక్షి తెలుసుకున్నది , మనిషి తెలుసుకోలేక ఏమేమో చేసేస్తున్నాడు .
  చిత్రమేమిటంటే అది ఎక్కువగా ఆలోచించదు , మనిషి ఎక్కువగా ఆలోచిస్తుంటాడు , ఇదే అసలైన కారణం అయ్యుండవచ్చు ఈ దుస్థితికి .

  శర్మ జీ ఎస్
  నా బ్లాగు : నా ఆలోచనల పరంపర

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s